ఆగస్టు - 3
|
¤ నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో శక్తిమంతమైన భూకంపం సంభవించడంతో 360 మంది మరణించారు. మరో 181 మంది గల్లంతయ్యారు. 1400 మంది గాయపడ్డారు. దీని తీవ్రత రిక్టర్ సూచీపై 6.5 గా నమోదైంది. ప్రకంపనల తీవ్రతకు 12 వేల ఇళ్లు కూలిపోగా మరో 30వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. |
ఆగస్టు - 4
|
¤ సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో తెలుగువారు చదువుకునేందుకు సౌకర్యంగా తెలుగు ఖురాన్‌కు చోటు కల్పించారు. » ప్రవాస భారతీయ డాక్టర్ మౌలానా అబ్దుర్రహీం అరబ్బీ నుంచి తెలుగులోకి అనువదించిన దివ్య ఖుర్ఆన్ గ్రంథాన్ని ఆయా మసీదుల్లో అందుబాటులో ఉంచారు.¤ గాజాలో పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో మరో 20 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1900 కి చేరింది. |
ఆగస్టు - 7
|
¤ పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో ఎబోలా వైరస్ బారినపడి సుమారు 950 మంది మరణించారు. » వైరస్ ప్రబలిన దేశాల్లో వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు రూ.1500 కోట్ల తక్షణ సాయం ప్రకటించాయి. » వైరస్ బారిన పడిన రిపబ్లిక్ ఆఫ్ గినియా, లైబీరియా, సియెర్రా లియోన్‌కు ఔషధాల కొనుగోలుకు రూ.30 లక్షల చొప్పున సాయాన్ని భారత్ ప్రకటించింది. » వైరస్ ప్రబలిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ, విమానాశ్రయాల వద్ద క్షుణ్నంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని భారత్ నిర్ణయించింది. » మనిషికి అత్యంత ప్రమాదకర వైరస్‌లలో ఒకటిగా ఎబోలా వైరస్‌ను పరిగణిస్తారు. మొదటిసారిగా కాంగోలోని ఎబోలా నది సమీపంలో 1976లో ఇది కనిపించింది. అందుకే దీనికి ఎబోలా అని పేరు పెట్టారు. వీటిలో అయిదు రకాలు ఉండగా మూడు చాలా ప్రమాదకరమైనవి. 100 మందికి సోకితే దాదాపు 70 మంది చనిపోతారు. 1979 నుంచి ఇప్పటివరకు 2,200 మందికి సంక్రమించగా 1500 మంది మరణించారు. » ఎబోలా వైరస్ సహజ ఆతిథేయులు గబ్బిలాలు. గబ్బిలాల ద్వారా ఇవి జంతువులకు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయి. » రోగి రక్తం, మలమూత్రాలు, చెమట, ఇతర శరీర ద్రవాలు అంటిన సూదులు, కలుషిత మాంసంతో ఇది సంక్రమిస్తుంది. మొదటి దశలో జ్వరం, తలనొప్పి, కీళ్లు, గొంతునొప్పి, బలహీనత, తీవ్ర అలసట వస్తాయి. రెండోదశలో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు రోగిని ఇబ్బంది పెడతాయి. మూడో దశలో వైరస్ దాడివల్ల కాలేయం, మూత్రపిండాలు విఫలమవుతాయి. శరీరంపై మచ్చలు, బొబ్బలు ఏర్పడతాయి. శరీరంలో అంతర్గత, బహిర్గత రక్తస్రావం మొదలై చివరికి రోగి మరణిస్తాడు. ఈ మూడు దశలు 2 - 21 రోజుల వ్యవధిలో జరిగిపోతాయి. 50 - 90% మంది 10 రోజుల్లోనే మరణిస్తారు. » ఎబోలా వైరస్ మనుషులకే కాకుండా గొరిల్లాలు, చింపాంజీలు, ముళ్లపందులు, దుప్పులుకు కూడా ప్రాణాంతకంగానే పరిణమిస్తోంది.¤ మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లవుతున్న సందర్భంగా లండన్ టవర్ వద్ద 'బ్లడ్ స్వెప్ట్ ల్యాండ్స్ అండ్ సీస్ ఆఫ్ రెడ్' పేరిట ఏర్పాటుచేసిన పింగాణీ పూల స్మారకాన్ని బ్రిటన్ యువరాజు విలియమ్ హ్యారీ, యువరాణి కేట్ అధికారికంగా ఆవిష్కరించారు. » మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 8,88,246 మంది బ్రిటిష్, కామన్వెల్త్ సైనికులకు (ఇందులో దాదాపు 74 వేల మంది భారతీయులు ఉన్నారు) గుర్తుగా ఈ స్మారకంలో 8,88,246 పింగాణీ పూలను ఏర్పాటు చేయనున్నారు. » ఇప్పటివరకు 1,20,000 పింగాణీ పూల మొక్కలను నాటారు. 2014, నవంబరు 11న చివరి పింగాణీ పూల మొక్కను నాటనున్నారు. (మొదటి ప్రపంచ యుద్ధం 1918, నవంబరు 11న ముగిసింది) |
ఆగస్టు - 8
|
¤ పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తున్న ఎబోలా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ 'అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర స్థితి'ని ప్రకటించింది. ఈ వైరస్ ప్రభావిత దేశాలకు ప్రపంచ దేశాలు సహాయం చేయాలని కోరింది. రెండు రోజులపాటు రహస్యంగా జెనీవాలో జరిగిన అత్యవసర కమిటీ సమావేశం అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లే విమానయాన సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. » పశ్చిమ ఆఫ్రికా వెలుపలకు ఎబోలా వ్యాపించడం అనివార్యమని అమెరికా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ వైరస్ అదుపు తప్పిందని, 60కి పైగా ప్రాంతాల్లో విజృంభిస్తోందని అమెరికా వైద్యులు హెచ్చరించారు. » గత నాలుగు దశాబ్దాల్లో అతిపెద్ద, చాలా తీవ్రమైన, సంక్లిష్టమైన మహమ్మారి ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ ప్రకటించారు. ఇప్పటివరకు 1700 మంది ఇన్ఫెక్షన్ బారిన పడగా 932 మంది మరణించారు. » 2009లో స్వైన్ ఫ్లూ వ్యాపించిన సమయంలోనూ, 2014 మేలో పోలియో విషయంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి అత్యవసర స్థితిని ప్రకటించింది. » ప్రస్తుత ఎబోలా వ్యాప్తి గినియాలో గత మార్చిలో ఆరంభమైంది. అక్కడి నుంచి సియెరా లియోన్, లైబీరియా, నైజీరియాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఎబోలా ఇన్‌ఫెక్షన్‌కు ప్రస్తుతం అనుమతి పొందిన చికిత్స గానీ టీకా గానీ లేదు.
|
ఆగస్టు - 10
|
¤ ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు దాదాపు 500 మంది యాజ్దీ మైనారిటీలను హతమార్చారు. వారిలో కొందరిని సజీవ సమాధి చేసినట్లు ఇరాక్ మానవ హక్కుల మంత్రి మహమ్మద్ షియా అల్ సుదాని ప్రకటించారు.¤ ఇరాన్‌లో విమానం కుప్పకూలిన ఘటనలో 38 మంది మరణించారు. టెహ్రాన్‌కు సమీపంలోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి తబాస్ పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. |
ఆగస్టు - 12
|
¤ ప్రాణాంతక ఎబోలా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రయోగాత్మక ఔషధాల వినియోగాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) అనుమతించింది. » ఈ వైరస్ బారినపడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా మరణించినట్లు తేలడంతో పాటు, స్పెయిన్‌కు చెందిన క్రైస్తవ మతగురువు కూడా మరణించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. » అమెరికాకు చెందిన మ్యాప్ బయోఫార్మాస్యూటికల్స్ అనే ప్రయివేటు సంస్థ ఎబోలా వైరస్ చికిత్సకు 'జడ్‌మ్యాప్' పేరుతో ఒక ఔషధాన్ని అభివృధ్ధి చేసే పనిలో ఉంది. ఇది ఇంకా ప్రాథమిక ప్రయోగాల దశలోనే ఉంది. ఇప్పటివరకు కోతులపై మాత్రమే ప్రయోగించారు. » లైబీరియాలో ఎబోలా వైరస్ సోకిన రోగులకు సేవలందిస్తున్న క్రమంలో స్పెయిన్‌కు చెందిన మిగ్యూల్ పాజరెస్ (75 సంవత్సరాలు) అనే మత గురువుకు ఈ వైరస్ సోకింది. అతడిని అక్కడి నుంచి స్పెయిన్‌కు తరలించి జడ్‌మ్యాప్‌తో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన మరణించారు. |
ఆగస్టు - 16
|
¤ ఉత్తర ఇరాక్‌లోని కొచో గ్రామంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఊచకోతకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 80 మంది పౌరులు మరణించారు. » మృతుల్లో ఎక్కువ మంది యజిది ధర్మాన్ని పాటించేవారే ఉన్నారు. ఇస్లాం మతంలోకి మారాలన్న డిమాండ్‌ను యజిది కుర్దులు నిరాకరించడంతో ఉగ్రవాదులు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. |
ఆగస్టు - 17
|
¤ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఆందోళన బాట పట్టిన మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించవద్దని, విద్యుత్, గ్యాస్ బిల్లులు కట్టొద్దని ప్రజలను కోరారు. » పార్లమెంటు, అధ్యక్ష నివాసం, ప్రధానమంత్రి నివాసం ఉండే 'రెడ్ జోన్'లోకి మాత్రం ప్రవేశించవద్దని ఆయన ప్రజలను కోరారు. |
ఆగస్టు - 19
|
¤ కొందరు దుండగులు దాడి చేయడంతో ఆసుపత్రి నుంచి పరారైన 17 మంది ఎబోలా వైరస్ వ్యాధి రోగుల ఆచూకీని కనిపెట్టినట్లు లైబీరియా అధికారులు ప్రకటించారు. » ప్రమాదకరమైన ఈ వైరస్ కారణంగా బాధిత దేశాల్లో తాజాగా మరో 84 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1229కి చేరిందని తెలిపింది.¤ ప్రపంచ ప్రఖ్యాత 'ఆక్స్‌ఫర్డ్' డిక్షనరీ సంస్థ తమ ఆన్‌లైన్ జాబితాలో mansplaining (మ్యాన్స్‌ప్లెయినింగ్) అనే పదాన్ని తాజాగా చేర్చింది. » ఆడ పిల్లలు సరికొత్త కెరీర్ వైపు అడుగువేయాలనుకుంటున్నప్పుడు లేదా ఒంటరిగా ధైర్యంతో ఓ పని సాధించాలనుకుంటున్నప్పుడు మగవారు ఎవరైనా 'అరెరె... అది చేయడం ఎంత కష్టమనుకున్నావ్! మగవాళ్లం మేమే చేయలేం. నీలాంటి అమ్మాయికైతే అసాధ్యం. నీ మంచి కోసం (అనుభవంతో) చెబుతున్నా విను!' అంటూ నిరుత్సాహపరిచే చేష్టని సూచించేందుకు స్త్రీవాదులు కనిపెట్టిన నూతన పదమే మ్యాన్స్‌ప్లెయినింగ్. » మ్యాన్, ఎక్స్‌ప్లెయినింగ్ అనే రెండు పదాల కలయిక ఇది. అంటే మగవారు తమ ఆధిక్యత నిరూపించుకోవడం కోసం ఇచ్చే ఉచిత సలహా అన్నమాట. » ఆరేళ్ల కిందట రచయిత్రి రెబెకా సోల్నిట్ మొదటిసారి తన వ్యాసంలో ఈ పదాన్ని వాడారు. 2010లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక మ్యాన్స్‌ప్లెయినింగ్‌కి 'వర్డ్ ఆఫ్ ద ఇయర్' హోదా ఇచ్చింది. |
ఆగస్టు - 24
|
¤ ఉత్తరాఫ్రికాను వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి ఎబోలా అక్కడి నైజీరియా, సియోరా లియోన్, గినియా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. చెమట, రక్తం తదితర శరీర ద్రవాల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కార్మికులకు సోకుతుందనే భయంతో పలు కంపెనీలను, గనులను మూసేశారు. ఈ వ్యాధి మూలంగా 624 మంది మృతి చెందిన లైబీరియాలో ఆర్థిక వృద్ధి రేటు బాగా పడిపోయింది. |
ఆగస్టు - 28
|
¤ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన సోదరుడు షాహబాజ్, మరికొందరు మంత్రులు, సీనియర్ అధికారులపై పోలీసులు హత్యా నేరాలు నమోదు చేశారు. » పాకిస్థాన్ అవామీ తెహరీక్ (పి.ఎ.టి.) అధినేత తాహిరుల్ ఖాద్రీ మద్దతుదారులైన 14 మందిని హతమార్చడానికి సంబంధించి ఈ కేసు నమోదయింది. » లాహోర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. |
ఆగస్టు - 31
|
¤ వందేళ్లకు పైగా సమయం తీసుకుని మధ్యయుగ లాటిన్‌పై ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తరహాలో పరిశోధకులు నిఘంటువును రూపొందించారు. » రాబర్ట్ వైట్‌వెల్ అనే పరిశోధకుడు 1913లో ఈ నిఘంటువు రూపకల్పనకు శ్రీకారం చుట్టాడు. |
No comments:
Post a Comment