older posts

Sunday 26 October 2014

సెప్టెంబరు - 2014 అంతర్జాతీయం

సెప్టెంబరు - 3
¤  భారత్‌కు యురేనియంను అమ్మడానికి వీలు కల్పించే అణు సహకార ఒప్పందంపై సంతకం చేయాలని భావిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించారు. త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.   »    మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సార్క్ దేశాధినేతలు కాకుండా భారత పర్యటనకు వస్తున్న తొలి ఇతర దేశాధినేత టోనీ అబాటే.   »    తగు రక్షణలతో భారత్‌కు యురేనియంను అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు అబాట్ సూచనప్రాయంగా తెలిపారు. భారత్ పూర్తిగా చట్టప్రకారం పనిచేస్తున్న ప్రజాస్వామ్య దేశమని ఆయన పేర్కొన్నారు.   »    ప్రపంచంలో మొత్తం యురేనియంలో మూడింట ఒక వంతు నిల్వలు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఆ దేశం ఏటా 7 వేల టన్నుల యురేనియంను ఎగుమతి చేస్తోంది.
సెప్టెంబరు - 11
¤  ఇరాక్, సిరియాల్లోని సాయుధ సంస్థ 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)' పై ఉగ్రవాద నిరోధక వ్యూహాలతో నిరంతర పోరు సాగిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా శపథం చేశారు. ఈ మేరకు ఆయన శ్వేతసౌథం నుంచి 15 నిమిషాల పాటు అధికార టీవీ కార్యక్రమంలో మాట్లాడారు.¤  ప్రపంచ వాణిజ్య సంస్థ, పెంటగన్‌పై ఉగ్రవాద దాడులు జరిగి 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దాడుల్లో మృతి చెందిన వారికి న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో నివాళులు అర్పించారు.
సెప్టెంబరు - 13
¤  ఇరాక్, సిరియాల్లో నరమేథం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) పై సంకీర్ణ దళాల పోరాటానికి విశ్రాంత అమెరికా నౌకాదళ అధికారి జాన్ అలెన్ సారథ్యం వహించనున్నారు. ఆయన పేరును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖరారు చేశారు.   »    అలెన్ గతంలో అఫ్గానిస్థాన్‌లో నాటో బలగాలకు కమాండర్‌గా కూడా వ్యవహరించారు.
సెప్టెంబరు - 17
¤  సిరియా, ఇరాక్‌లలోని పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు అమెరికాను హెచ్చరిస్తూ 'యుద్ధ జ్వాలలు' (ఫ్లేమ్స్ ఆఫ్ వార్) పేరుతో వీడియో విడుదల చేశారు.
సెప్టెంబరు - 18
¤  బ్రిటన్ నుంచి స్వతంత్య్రం పొందే అంశంపై స్కాట్లాండ్‌లో రెఫరెండం జరిగింది. ఇందులో 97 శాతం మంది (దాదాపు 43 లక్షల మంది) ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు.   »    ఇందులో ఎక్కువ శాతం 'ఔను' కు ఓటు వేస్తే 1707 నుంచి బ్రిటన్ పాలనలో ఉన్న ఈ ప్రాంతం కొత్త దేశంగా అవతరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఉండాలా? అనే ప్రశ్నను ఓటర్లకు ఈ రెఫరెండంలో సంధించారు.
సెప్టెంబరు - 19
¤  స్కాట్లాండ్‌లో నిర్వహించిన రెఫరెండం ఫలితాలు వెలువడ్డాయి. స్కాట్లాండ్ డిమాండ్‌కు వ్యతిరేకంగా 20 లక్షల మంది (20,01,926) స్పందించగా, అనుకూలంగా 16 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి.   »    స్కాట్లాండ్‌లో వేర్పాటు వాదానికి స్కాట్లాండ్ నేషనల్ పార్టీ నాయకత్వం వహించింది. రెఫరెండం ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీ నేత, స్కాట్లాండ్ ప్రథమ ప్రతినిథి అలెక్స్ సాల్మాండ్ పదవికి రాజీనామా చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తామంటూనే వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.¤  నేపాల్‌లో జీఎంఆర్ నిర్మించ తలపెట్టిన జల విద్యుత్ కేంద్రానికి కేంద్రమంత్రి మండలి లాంఛనంగా ఆమోదం తెలిపింది.   »    నేపాల్‌లో 140 కోట్ల డాలర్లతో 900 మెగావాట్ల ప్లాంట్‌ను జీఎంఆర్ నిర్మిస్తుంది.   »    'అప్పర్ కర్నాలీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్' పేరుతో నేపాల్ ప్రభుత్వం 2008లోనే దీని నిర్మాణానికి అనుమతినిచ్చింది.   »    ప్రాజెక్టులో 27 శాతం వాటా నేపాల్ ప్రభుత్వానికి ఇస్తారు.
సెప్టెంబరు - 20
¤  న్యూజిలాండ్ ఎన్నికల్లో జాన్‌కీ నేతృత్వంలోని నేషనల్ పార్టీ 48% ఓట్లతో 61 సీట్లు సాధించి చరిత్రాత్మక విజయాన్ని పొందింది. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ కేవలం 32 సీట్లతో సరిపెట్టుకుంది.   »    జాన్‌కీ మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించనున్నారు.
సెప్టెంబరు - 21
¤  భారత ఉపఖండానికి బ్రిటిష్ పాలన వల్ల కలిగిన ప్రయోజనం కంటే జరిగిన నష్టమే ఎక్కువ అని లండన్ సుప్రీంకోర్టులో నిర్వహించిన మాదిరి విచారణ (నమూనా విచారణ)లో స్పష్టమైంది.   »    'ది ఇండో-బ్రిటిష్ హెరిటేజ్ ట్రస్టు' ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.   »    భారత్-బ్రిటన్‌ల మధ్య 1614లో లాంఛనంగా సంబంధాలు ప్రారంభమై నాలుగు వందలు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ చర్చలు జరిగాయి.¤  అఫ్గానిస్థాన్ తదుపరి అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ బాధ్యతలు స్వీకరించేందుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది.   »    జూన్‌లో జరిగిన అఫ్గానిస్థాన్ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఆర్థికమంత్రి అష్రాఫ్ ఘనీ, ప్రతిపక్షనేత అబ్దుల్లా ఇద్దరూ తాము విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. ఫలితంగా దేశంలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.   »    తాజా ఒప్పందంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ ఒప్పందం ప్రకారం అష్రాఫ్ ఘనీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
సెప్టెంబరు - 22
¤  సిరియాలో ఇద్లిబ్ రాష్ట్రంలో తిరుగుబాటుదారులు లక్ష్యంగా ప్రభుత్వం జరిపిన వైమానిక దాడుల్లో 16 మంది చిన్నారులు సహా 42 మంది చనిపోయారు. ఇద్లిబ్ రాష్ట్రం చాలా వరకు తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది.
సెప్టెంబరు - 25 
¤ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రీమాంట్ జిల్లా కిందకు వచ్చే అన్ని ఉన్నత పాఠశాలల్లో తెలుగును అధికారికంగా ప్రపంచ భాషగా గుర్తించనున్నారు.
   » 9-12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు 'సిలికానాంధ్ర మనబడి'లో తెలుగు భాషను అభ్యసిస్తే వారికి ఫ్రీమాంట్ జిల్లా ఉన్నత పాఠశాలల విద్యాశాఖ నుంచి అధికారికంగా హైస్కూల్స్ క్రెడిట్స్ లభిస్తాయి. ఈ మేరకు 'సిలికానాంధ్ర మనబడి' ప్రతినిధులు విద్యాశాఖాధికారులతో సమావేశమై ఒప్పంద ప్రతాలపై సంతకాలు చేశారు.
   » ప్రైవేట్‌గా తెలుగు భాషను నేర్పిస్తూ, ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు లభించిన తొలి సంస్థగా 'సిలికానాంధ్ర మనబడి' ఘనత దక్కించుకుంది.
 
సెప్టెంబరు - 26 
¤  భారత ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా న్యూయార్క్ న్యాయస్థాన మొకటి సమన్లు జారీ చేసింది. గుజరాత్‌లో 2002లో జరిగిన మత కల్లోలాల వెనుక ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ న్యూయార్క్‌కు చెందిన అమెరికన్ జస్టిస్ సెంటర్ (ఏజేసీ) అనే మానవ హక్కుల సంస్థ ఏలియన్ టార్ట్ క్లెయిమ్స్ చట్టం (ఏటీఎస్) కింద దాఖలు చేసిన వ్యాజ్యం మేరకు ఈ సమన్లు జారీ చేసింది. అయితే అమెరికా ప్రభుత్వం ఈ అంశంపై సత్వరం స్పందించింది. ప్రభుత్వాధినేతగా మోడీకి దౌత్య రక్షణ ఉందని స్పష్టం చేసింది.   » సమన్లు అందిన 21 రోజుల్లో మోడీ స్పందించాలని న్యూయార్క్ దక్షిణ జిల్లా ఫెడరల్ న్యాయస్థానం పేర్కొంది.   » సమన్లపై భారత ప్రభుత్వం స్పందిస్తూ, మోడీపై చేసిన ఆరోపణలు ఆధారరహితమని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
సెప్టెంబరు - 28 
¤  'అంతర్జాతీయ యోగా దినోత్సవం' ఉండాలని, ఈ మేరకు ఐక్యరాజ్యసమితి కృషి చేయాలంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు పలు ప్రపంచ దేశాల నుంచి సానుకూల స్పందన మొదలైంది.   » ఈ విషయంపై మొదటిగా శ్రీలంక స్పందించింది. భారత్ డిమాండ్‌ను తాము సమర్థిస్తున్నట్లు లిఖిత పూర్వకంగా ప్రకటించింది. 
సెప్టెంబరు - 29
¤  జపాన్‌లో ఒటాకే అగ్ని పర్వతం పేలిన సంఘటనలో మృతుల సంఖ్య 36 కు చేరింది.¤  అప్ఘానిస్థాన్ కొత్త అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ ప్రమాణ స్వీకారం చేశారు.   »  అంతర్యుద్ధంతో అట్టుడికిన అప్ఘానిస్థాన్‌లో తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా హమీద్ కర్జాయ్ నుంచి అష్రాఫ్ ఘనీకి అధికార బదిలీ జరిగింది.

No comments:

Post a Comment