older posts

Sunday, 26 October 2014

జులై - 2014 అంతర్జాతీయం

జులై - 1
¤  అమెరికా గూఢచార సంస్థ 'నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) 2010లో మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైన భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలపై నిఘా పెట్టినట్లు వెల్లడైంది.   »    ప్రపంచవ్యాప్తంగా ఆరు రాజకీయ పార్టీలపై ఎన్ఎస్ఏ నిఘా వేయగా వాటిలో బీజేపీ ఒకటని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. మిగిలిన పార్టీల్లో అమల్ (లెబనాన్), బొలీవరియన్ కాంటినెంటల్ కోఆర్డినేటర్ (వెనెజులా), ముస్లిం బ్రదర్‌హుడ్ (ఈజిప్ట్), నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ (ఈజిప్ట్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పాకిస్థాన్) ఉన్నాయి.   »    ఈ రాజకీయ సంస్థల కార్యకలాపాలను రహస్యంగా పరిశీలించడానికి ఎన్ఎస్ఏకు 2010లో అమెరికాలోని విదేశీ నిఘా న్యాయస్థానం అనుమతినిచ్చిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఎన్ఎస్ఏ మాజీ గుత్తేదారు ఎడ్వర్డ్ స్నోడెన్ గతంలో అందించిన పత్రాల ద్వారా ఈ వివరాలు బయటపడ్డాయని ఆ పత్రిక పేర్కొంది.   »    బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అన్ని దేశాలు, ఆయా దేశాల్లోని రాజకీయ పార్టీలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి సంస్థలపై నిఘా వేయడానికి ఎన్ఎస్ఏకు చట్టం అనుమతిస్తోందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
జులై - 2
¤  నౌకా విధ్వంసక హార్పూన్ క్షిపణులను భారత్‌కు విక్రయించాలన్న తన నిర్ణయాన్ని అమెరికా రక్షణశాఖ పెంటగన్ ఆ దేశ కాంగ్రెస్‌కు తెలియజేసింది.   »    ఈ ఒప్పందం విలువ 20 కోట్ల డాలర్లు. దీనికింద దాదాపు డజను యూజీఎం - 84 ఎల్ హార్పూన్ క్షిపణులు, 10 యూటీఎం - 84 ఎల్ హార్పూన్ శిక్షణ క్షిపణులు, రెండు శిక్షణ వాహనాలను భారత్‌కు సరఫరా చేయనున్నట్లు పెంటగన్ ప్రకటించింది.   »    వీటిని భారత నౌకాదళంలోని శిఘమర్ తరగతి జలాంతర్గామిలో మోహరిస్తారు. ఫలితంగా భారత్‌కు కీలక సముద్ర మార్గాల్లో రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.   »    వైమానికదళంలోని జాగ్వర్ యుద్ధ విమానం, నౌకాదళ పి - 8 ఐ సముద్ర గస్తీ విమానంలో అమర్చేందుకు హార్పూన్ క్షిపణులను భారత్ ఇప్పటికే కొనుగోలు చేసింది.   »    ఈ అస్త్రాలను బోయింగ్ సంస్థ తయారుచేస్తోంది.
జులై - 4 
¤  ఇరాక్‌లో ఉగ్రవాదుల చేతిలో చిక్కుకున్న 46 మంది భారత నర్సులకు స్వేచ్ఛ లభించింది.   »    ఇరాక్‌లోని అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఈ నర్సులు తిక్రిత్ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఘర్షణల నేపథ్యంలో వారు ఆసుపత్రిలోనే తలదాచుకుంటున్నారు. అయితే వీరిని ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు చెందిన ఉగ్రవాదులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. తిక్రిత్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోసుల్ నగరంలో నిర్బంధించారు. తాజాగా ఉగ్రవాదులు వీరికి విముక్తి కల్పించారు.   »    విడుదల అయిన నర్సులతో పాటు ఉత్తర ఇరాక్‌లోని కర్కిక్‌కు చెందిన 70 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. 
జులై - 10
¤  ఇరాక్, సిరియాలలో తిరుగుబాటుదారులకు నేతృత్వం వహిస్తూ రక్తపాతాన్ని పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవెంట్ (ఐఎస్ఐఎల్) సంస్థ అధినేత అబుబకర్ అల్ బగ్దాదీ తలకు అమెరికా వేలం కట్టింది.   »    అబు బకర్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారికి కోటి డాలర్లు (రూ.60 కోట్లు) బహుమతిని ఇస్తామని ప్రకటించింది.¤  భారత్ నుంచి మరింతమంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో బ్రిటన్ తన ఉపకారవేతనాల పథకాన్ని మరింత విస్తరించింది.   »    చీవెనింగ్ స్కాలర్‌షిప్‌ల పేరిట విద్యార్థులకు అందించే ఫెలోషిప్‌లను నాలుగు రెట్లకు పైగా పెంచారు.   »    2015 - 16 సంవత్సరం నుంచి కేటాయింపును 24 లక్షల పౌండ్లకు (రూ.24.68 కోట్లు) పెంచారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 6 లక్షల పౌండ్ల (రూ.6.18 కోట్ల) నుంచి పెంచిన ఈ స్కాలర్‌షిప్‌లను రెండేళ్లపాటు అమలు చేస్తారు.
జులై - 12
¤  విశ్వవిఖ్యాత బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ పూర్వీకుల ఇంటిని పాకిస్థాన్ ప్రభుత్వం జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఈ మేరకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇల్లు పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో ప్రఖ్యాతిగాంచిన ఖవానీ బజార్ ప్రాంతంలో ఉంది.¤  అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో 2004 తర్వాత తొలిసారిగా ఒక ప్లేగు కేసు నమోదైంది.
జులై - 17
¤  ఉక్రెయిన్ - రష్యా సరిహద్దులో ఉగ్రవాదులు క్షిపణి దాడిచేసి విమానాన్ని పేల్చివేసిన ఘటనలో మొత్తం 295 మంది మృతి చెందారు.   »    మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎమ్‌హెచ్ 17 అనే బోయింగ్ 777 విమానం ఆమ్‌స్టర్‌డ్యామ్ నుంచి బయలుదేరి కౌలాలంపూర్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. తూర్పు ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించిన విమానం, రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు నిలయమైన దోనెత్స్క్ అనే ప్రాంతంలోని షాక్తార్స్క్ పట్టణ సమీపానికి చేరుకున్న తర్వాత రాడార్‌లో కనిపించకుండా పోయింది. ఆ తర్వాత రష్యా సరిహద్దుకు 40 కి.మీ. దూరంలో ఉన్న గ్రాబోవో అనే గ్రామంలో మంటల్లో కాలిపోతున్న విమాన శిథిలాలు, మృతదేహాలను గుర్తించారు.   »    రష్యా అనుకూల వర్గాలు, ఉక్రెయిన్ సైనికులకు మధ్య ఘర్షణలు జరుగుతున్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేర్పాటువాదులు ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌కు చెందిన పలు సైనిక విమానాలను కూల్చివేశారు. వారికి రష్యానే అత్యంత అధునాతన క్షిపణులను అందిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
జులై - 18
¤  అరుణాచల్‌ప్రదేశ్‌ను తమ భూభాగంలోని 'దక్షిణ టిబెట్‌'గా చూపుతూ రూపొందించిన లక్షలాది మ్యాపులను చైనా తన సైనికులకు అందజేసినట్లు 'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ' (పీఎల్ఏ) దినపత్రిక వెల్లడించింది.   »    చైనా చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది.
జులై - 20
¤  గాజాలోని హమాస్ స్థావరాలు లక్ష్యంగా గగన, భూతలాల నుంచి ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో 90 మంది పాలస్తీనియన్లు మరణించారు. దీంతో 13 రోజులుగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 425కు చేరింది.   »    'ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్' పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడుల్లో చనిపోయిన వారిలో 112 మంది మైనర్లు, 41 మంది మహిళలు, 25 మంది వృద్ధులు ఉన్నారు.
జులై - 21
¤  నల్లధనం సమస్యపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడేందుకు ముందుకు కదిలాయి.   »    ప్యారిస్‌లోని 'ఆర్థిక సహకారం, అభివృద్ధి' (ఓఈసీడీ) సంస్థ ఆర్థిక ఖాతాదారుల సమాచారం పంపిణీపై 'ఏకీకృత విశ్వ ప్రమాణాలను' విడుదల చేసింది.   »    సెప్టెంబరులో జరిగే జీ - 20 ఆర్థికమంత్రుల సమావేశంలో ఈ కొత్త ప్రమాణాలను ప్రతిపాదించనుంది. వివిధ సభ్యదేశాల అంగీకారం తర్వాత ఇవి అమల్లోకి వస్తాయి. దీనివల్ల ఒకదేశంలో డబ్బులు దాచుకున్న విదేశీయుల వివరాలను ఆ దేశ ప్రభుత్వం సదరు వ్యక్తి మాతృ దేశ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఇది ఏటా క్రమం తప్పకుండా జరుగుతుంది.   »    బ్యాంకులు, ఆర్థిక సంస్థల బ్రోకర్లు, ఫండ్‌హౌస్‌లు లాంటి సంస్థలన్నీ ఈ వివరాలను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఒక దేశంలో పన్ను ఎగవేసి మరో దేశంలో నల్లధనాన్ని దాచుకునే సంపన్నుల వివరాలు సులభంగా తెలిసిపోతాయి.   »   ఓఈసీడీ ప్రమాణాలకు అంగీకరించిన వాటిలో భారత్‌తో పాటు అమెరికా, స్విట్జర్లాండ్, మారిషస్, బ్రిటన్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, జపాన్, సింగపూర్, చైనా, గ్రీస్ తదితర దేశాలున్నాయి.¤  మలేషియా విమాన దుర్ఘటన నేపథ్యంలో ఆధిపత్యం కోసం మళ్లీ పోరాటం మొదలైంది. ఈ దుర్ఘటన జరిగిన ప్రదేశానికి చేరువలోని డొనెట్‌స్క్ నగరంపై ఆధిపత్యం కోసం పోరాటం చెలరేగింది.   »   డొనెట్‌స్క్ నగరాన్ని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఏప్రిల్‌లో చేజిక్కించుకున్నారు. దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉక్రెయిన్ దళాలు దాడులు మొదలుపెట్టాయి.   »   ఉక్రెయిన్ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటులో డొనెట్‌స్క్ కేంద్ర బిందువుగా ఉంది. ఈ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఇటీవల మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 17 విమానం నేలకూలి, అందులోని 298 మంది మరణించారు. విమాన శకలాలు తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతంలో పడటంతో అక్కడికి చేరుకోవడానికి అంతర్జాతీయ అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో డొనెట్‌స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు శతఘ్నులతో దాడులు జరిగాయి.   »   మరోవైపు డచ్ దర్యాప్తు బృందం అధికారులు తూర్పు ఉక్రెయిన్‌లోని టొరెజ్‌కు చేరుకున్నారు. ఇప్పటివరకు ఘటనా స్థలంలోకి ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్‌సీఈ) కి చెందిన పరిశీలకులను మాత్రమే పరిమితంగా అనుమతించారు.   »   అంతర్జాతీయ దర్యాప్తునకు సహకరించేలా ఉక్రెయిన్ వేర్పాటువాదులను ఒప్పించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు స్పష్టం చేశారు.
జులై - 22
¤  మలేసియా విమాన దుర్ఘటనను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై అంతర్జాతీయ పౌర విమానయాన మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిస్థాయి, స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని కోరింది.   »   ఆస్ట్రేలియా రూపొందించిన ఈ తీర్మానాన్ని మొత్తం 15 సభ్యదేశాలు ఆమోదించాయి. రష్యా కూడా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటువేసింది. అంతకుముందు తీర్మానంలో కొన్ని మార్పులు చేశారు. దుర్ఘటనకు సంబంధించి 'కూల్చివేయడం' స్థానంలో 'కూలడం' అనే పదాన్ని చేర్చారు.
జులై - 24
¤  అల్జీరియాలోని 'ఎయిర్ అల్జీరి' కు చెందిన విమానం మాలిలో గల్లంతయింది. ఇది కూలిపోయి ఉంటుందని విమాన సంస్థతో పాటు ఫ్రాన్స్, బుర్కినాఫాసో ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.   »   విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.   »   మెక్‌డోనెల్ డగ్లస్ ఎండీ - 83 రకానికి చెందిన ఈ విమానం బుర్కినాఫాసో రాజధాని అవాగాడగోవ్ నుంచి అల్జీర్స్‌కు వెళుతోంది. టేకాఫ్ అయిన 50 నిమిషాల అనంతరం కంట్రోల్ టవర్‌తో విమాన సంబంధాలు తెగిపోయాయి.¤  హమాస్ పాలనలో ఉన్న గాజాలో ఇజ్రాయెల్ ట్యాంకులు ఐరాస నిర్వహిస్తున్న ఒక పాఠశాలపై దాడులు చేసి అందులో ఆశ్రయం పొందుతున్న 15 మందిని హతమార్చాయి.   »   సాయుధ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఆ ప్రాంతంలో మరణించిన పాలస్తీనా వాసుల సంఖ్య 770 దాటిపోయింది.
జులై - 25
¤  116 మందితో గల్లంతైన అల్జీరియా విమానం మాలిలో కూలిపోయిందని అధికారులు నిర్ధారించారు.   »   అందులో ఉన్నవాళ్లంతా మరణించారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండే పేర్కొన్నారు. వీరిలో 51 మంది ఫ్రాన్స్ దేశస్థులు ఉన్నారు.
జులై - 26 
¤  శిథిలాల మధ్య చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయడం కోసం గాజా ప్రాంతంలో 12 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలన్న ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తిని ఇజ్రాయెల్, పాలస్తీనా సంస్థ హమాస్ మన్నించాయి.   »   ఈ నేపథ్యంలో గాజా ప్రాంతంలో పాలస్తీనావాసులు ఇజ్రాయెల్ బాంబుల ధాటికి కూలిన భవనాల శిథిలాల్లో గాలింపు చేపట్టారు. గాజా ప్రాంతంలో దాదాపు 100 మృతదేహాలను సహాయ సిబ్బంది కనుక్కుంది. దీంతో జులై 8న ఘర్షణలు మొదలైనప్పటి నుంచి మరణించిన పాలస్తీనా వాసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది.   »   ఘర్షణల్లో తమ సైనికులు 40 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.¤  సిరియాలో సైనికులు, ఇస్లామిక్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న భీకర పోరులో 85 మంది సైనికులు మృతి చెందారు.   »   సిరియాలోని ఉత్తరాది అల్‌రక్కా ప్రావిన్స్‌లోని సైనిక స్థావరాలపై ఇస్లామిక్ ఉగ్రవాదులు బాంబులు, క్షిపణులతో దాడులకు తెగబడటంతో సిరియా సైనికులు, అధికారులు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు.
జులై - 28
¤  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభానికి వందేళ్లు పూర్తయ్యాయి.   »   1914 జులై 28న సెర్బియాపై ఆస్ట్రియా - హంగేరీ యుద్ధం ప్రకటించాయి. ఇదే మొదటి ప్రపంచ యుద్ధానికి ఆరంభం.   »   ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా ప్రపంచంలో చాలా మంది పెద్దగా వినని దేశాల పేర్లు. కానీ సరిగ్గా వందేళ్ల కిందట ఒక మహా సంగ్రామం మొదలు కావడానికి ఈ దేశాలే కారణమయ్యాయి.   »   మొదటి ప్రపంచ యుద్ధం అధికారికంగా 1918 నవంబరు 11 న ముగిసింది.
జులై - 30
¤  భారత మిరియాలపై తాత్కాలికంగా నిషేధాన్ని విధిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.   »   భారత మిరియాల్లో ఎక్కువ మోతాదులో క్రిమిసంహారక మందులు ఉండటమే నిషేధానికి కారణమని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది.
జులై - 31
¤  అభివృద్ధి కోసం సమాచార, ప్రసారాల పరిజ్ఞానాలను ఉపయోగించుకోవడానికి ఉద్దేశించిన ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఆమోదించింది.   »   భారత్ నేతృత్వంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది గొప్ప విజయం. డిజిటల్ వ్యత్యాసాలను పూరించడంపై ఈ తీర్మానం దృష్టి పెడుతుంది.   »   దీనికోసం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున ఆరు నెలలుగా చైనా, అమెరికా, ఈయూ ప్రతినిధులతో తీవ్రంగా చర్చలు జరిపింది.   »   అభివృద్ధి కోసం, డిజిటల్ వ్యత్యాసాలను పూరించడానికి సమాచార, ప్రసార పరిజ్ఞానాలను ఉపయోగించుకోవడంపై తీర్మానం దృష్టి పెట్టాలని భారత్ నొక్కి చెప్పింది.

No comments:

Post a Comment